ముగించు

నీటి వనరుల విభాగం (SE – సోమసిల ప్రాజెక్ట్ సర్కిల్)

శాఖ / సంస్థ గురించి పరిచయం:

పెన్నా నదికి నెల్లూరు జిల్లాలో మొదట రెండు భారీ నీటిపారుదల పథకములు ఉన్నవి. ఒకటి నెల్లూరు పట్టణము నందు సుమారు నూట అరవై సంవత్సరముల క్రితం కట్టబడిన నెల్లూరు ఆనకట్ట మరియు దాని సంబంధిత కాలువల సముదాయము. రెండవది సంగం గ్రామ సమీపమున కట్టబడిన సంగం ఆనకట్ట. ఈ రెండు ఆనకట్టల క్రింద గల సాగు ప్రాంతము పెన్నారు డెల్టా అని వ్యవహరింపబడుచున్నది. ఆ తరువాత కాలంలో అనంతసాగరం మండలంలోని సోమశిల గ్రామము వద్ద సోమశిల జలాశయము అను పెద్ద భారీ నీటి పారుదల జలాశయం నిర్మించడమైనది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

సోమశిల ప్రాజెక్టు :

ప్లానింగ్ కమిషన్, భారత ప్రభుత్వం వారు 1973 లో ఐదవ పంచ వర్ష ప్రణాళికలో సోమశిల జలాశయము పెన్నానదిఫై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనంతసాగరము మండలము, సోమశిల గ్రామము వద్ద నిర్మింప బడుటకు రు.17.20 కోట్ల అంచనాలతో అనుమతులు ఇవ్వడం జరిగినది. ఈ ప్రాజెక్ట్ 1976 లో ప్రారంభిoచబడి 1989 నాటికి ప్రాజెక్ట్ ముఖ్య నిర్మాణపు పనులు పూర్తి అయినవి. 6 వ రివైజ్డ్ ఎస్టిమేట్, 2013 సంవత్సరం నకు రూ.1548.49 కోట్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి అనుమతులు ఉన్నవి. ప్రస్తుతము సవరించిన అంచనాల మేరకు 2019 సంవత్సరం నకు గాను రూ.2890.00 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వ అనుమతులకు పంపడమైనది.

ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యములు :

  • సోమశిల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యము -78 టి.యం.సి.లు
  • శ్రీశైలం జలాశయము నుండి క్రిష్ణనది జలాలు సోమశిల రిజర్వాయర్ ద్వారా కండలేరు రిజర్వాయర్ కు తదుపరి చెన్నై నగరపు త్రాగు నీటి అవసరములకు 3 రాష్ట్రాల అంగీకారపు ఒప్పందం ప్రకారం పంపు నీటి పరిమాణము – 15 టి.యం.సి.లు
  • పెన్నా వరద జలాలను నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తెలుగు గంగ ప్రాజెక్ట్ క్రింద 3,00,000 ఎకరముల ఆయకట్టు సాగుకు తరలించు నీటి పరిమాణము – 30.00 టి.యం.సి.లు
  • నెల్లూరు నగరమునకు, ఆత్మకూరు మరియు కావలి పట్టణము త్రాగునీటి అవసరములకుగాను 1.70 టి.యం.సి.లు మరియు పరిశ్రమల వినియోగమునకుగాను 0.80 టి.యం.సి.లు కేటాయించబడినవి.
  • పెన్నా వరద జలాలను సోమశిల హై లెవెల్ కాలువ ద్వారా ఆత్మకూరు మరియు ఉదయగిరి నియోజక వర్గాలలోని మండలాలకు త్రాగు మరియు 90,000 ఎకరముల ఆయకట్టు సాగుకు తరలించు నీటి పరిమాణము – 5.00 టి.యం.సి.లు
  • 23 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుచున్నది.
  • సోమశిల ప్రాజెక్ట్ ద్వారా మొత్తము 5,84,500 ఎకరములు సాగులోనికి తీసుకొని వచ్చుటకు ప్రతిపాదించడమైనది . ఇందులో 4,05,500 ఎకరములు మాగాణి భూమిని స్తిరీకరించుటకు మరియు 1,79,000 ఎకరములు క్రొత్త ఆయకట్టును ప్రతిపాదించడమైనది.

ప్రాజెక్టు ఆయకట్టు వివరములు :

క్రమ సంఖ్య కాలువ వ్యవస్థ ఆమోదింపబడిన ఆయకట్టు (ఎకరాలలో) ప్రస్తుత మొత్తం ఆయకట్టు (ఎకరాలలో) అభివృద్ధి చెందిన ఆయకట్టు    (ఎకరాలలో)
1 a) పెన్నా డెల్టా(మొదటి పంట-ఖరీఫ్ ) 175000 247000 247000
  b) రెండవ పంట-రబీ 19000 19000 19000
2 కనుపూరు కాలువ 61000 61000 61000
3 కావలి కాలువ 75000 75000 74000
4 జి.కే.ఎన్ కాలువ (ఉత్తరకాలువ పొడగింపు తో సహా) 141500 141500 98000
5 దక్షిణ కాలువ 41000 41000 35500
  మొత్తం 512500 584500 534500

సోమశిల కాలువలు – వివరములు:

1. ఉత్తరపు కాలువ:-

ఈ కాలువ సోమశిల డ్యామ్ వద్ద లెఫ్ట్ హెడ్ రెగ్యులేటర్ నుండి మొదలయి 73.920 కి.మీ పొడవు వున్నది. ఈకాలువ క్రింద ఆయకట్టు 43,000 ఎకరములకు గాను 41,400 ఎకరాలు అభివృద్ధి అయివున్నది . తదుపరి ఈ కాలువ పై 3 ప్యాకేజి పనులు చేపట్టబడినవి. ప్యాకేజి 11 మరియు 96 ద్వారా కాలువ వెడల్పు మరియు అభివృద్ధి పనులు చేపట్టడము జరిగినది. అలాగే కాలువ పొడిగింపు పనులు రాళ్ళపాడు రిజర్వాయర్ వరకు ప్యాకేజి 32 ద్వారా చేపట్టబడినవి. ప్యాకేజి 32 ద్వారా నెల్లూరులో 58,500 ఎకరములు మరియు ప్రకాశం జిల్లాలో (రాళ్ళపాడు రిజర్వాయర్ ద్వారా) 40,000 ఎకరములు సాగులోనికి తీసుకొని వచ్చుటకు ప్రతిపాదిoచుటమైనది. పై ప్యాకేజి పనులు చేపట్టబడి పురోగతిలో ఉన్నవి. ఈ కాలువ ద్వారా అనంతసాగరము, ఆత్మకూరు, మర్రిపాడు, ఎ.యస్. పేట, దగదర్తి, కొండాపురం, జలదంకి, కలిగిరి మరియు సంగం మండలాలకు సాగు మరియు త్రాగు నీరు సరఫరా చేయుబడు చున్నది.

2. దక్షిణపు కాలువ:-

ఈ కాలువ డ్యామ్ వద్ద రైట్ హెడ్ రెగ్యులేటర్ వద్ద మొదలయి 74.725 కి.మీ పొడవు వున్నది. ఈకాలువ క్రింద ఆయకట్టు 41,000 ఎకరాలను సాగులోనికి తీసుకు రావలిసియుoడగా 35500 ఎకరాలకు మాత్రమె నీరు అందించబడుతుంది. మిగిలిన 5500 ఎకరాల ఆయకట్టు అటవీ శాఖ అనుమతి వచ్చుటలో జాప్యము వలన అభివృద్ధి కావలసి యున్నది. ఈ కాలువ ద్వారా కలువాయి, చేజెర్ల మరియు పొదలకూరు మండలాలకు సాగు మరియు త్రాగు నీరు సరఫరా చేయుబడు చున్నది.

3. కావలి కాలువ:-

ఈ కాలువ సంగం ఆనకట్ట వద్ద నుండి మొదలయ్యేకనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ పై కి.మి. 1.609 వద్ద నుండి మొదలయి 67.619 కి.మి.ల పొడవు ఉన్నది. ఈ కాలువ పనులు మొట్ట మొదటగా 1975 లో ప్రారంభించబడి 1980 నకు పూర్తి అయినవి. ఈ కాలువ యొక్క ఫేజ్ .1 ఆయకట్టు 42,000 ఎకరాలు మరియు డిశ్చార్జ్ 650 క్యూసెక్కులు.

ఈ కాలువ పై ఫేజ్ .2 లో రు.36.62 కోట్లకు కాలువ వెడల్పు మరియు లోతు పెంచు పనులు చేపట్టబడి పూర్తి అయినవి. దీని వలన డిశ్చార్జ్ 950 క్యూసెక్కులకు పెరిగినది. అంతే కాకుండా ఆయకట్టు 75000 ఎకరాలకు పెరిగినది. ప్రస్తుతము 75000 ఎకరాలకు గాను 74000 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నది. అటవీ శాఖ అనుమతి వచ్చుటలో జాప్యము వలన 1000 ఎకరములు ఇంకనూ అభివృద్ధి కావలసి ఉన్నది. ఈ కాలువ ద్వారా దగదర్తి, కొడవలూరు, భోగోలు, జలదంకి,కలిగిరి, కావలి మరియు సంగం మండలాలకు సాగు మరియు త్రాగు నీరు సరఫరా చేయుబడు చున్నది.

సోమశిల ముంపు మరియు పునరావాసం:

ఈ రిజర్వాయరు నిర్మాణం వలన కడప జిల్లా లోని 108 గ్రామాలు ముంపునకు గురి అయినవి. వీటికి సంబంధించి నష్టపరిహారం అప్పటి భూసేకరణ చట్టపు నిబంధనల ప్రకారం చెల్లించడం జరిగినది. వాటిలో కొన్ని కోర్టు వివాదములో ఉన్న వాటికి తీర్పు తదుపరి చెల్లించడం జరుగుతుంది. జి.ఓనెం.58, తేది.19.03.1980 ప్రకారం ఈ ప్రాజెక్ట్ నకు ఆర్ & ఆర్ చట్టం వర్తించదు.

పనుల వివరములు:

1. ప్యాకేజి పనులు:

ఎ. ప్యాకేజి.11: ఉత్తరపు కాలువ వెడల్పు కి.మీ.0.00 నుండి కి.మీ. 13.00 వరకు: పనులు పూర్తి అయినవి.

బి. ప్యాకేజి.96: ఉత్తరపు కాలువ వెడల్పు కి.మీ.13.00 నుండి కి.మీ.72.920 వరకు: పనులను ప్రభుత్వం వారు నిలిపివేయడమైనది.

సి. ప్యాకేజి.32: ఉత్తరపు కాలువ పొడగింపు కి.మీ. 72.920 నుండి కి.మీ.104.50 రాళ్ళపాడు రిజర్వాయరు వరకు: పనులు పురోగతిలో ఉన్నవి.

డి. ప్యాకేజి.94: కావలి కాలువ వెడల్పు మరియు లైనింగ్ పనులు: ప్రభుత్వం వారు నిలిపివేయడమైనది.

ఇ. ప్యాకేజి.95: దక్షిణపు కాలువ వెడల్పు మరియు లైనింగ్ పనులు: ప్రభుత్వం వారు నిలిపివేయడమైనది.

2. ప్యాకేజేతర పనులు:

31 పనులను చేపట్టి 17 పనులను పూర్తి చేయడమైనది మరియు మిగిలిన 14 పనులు పురోగతిలో ఉన్నవి.

కాలువల క్రింద భూసేకరణ:

మొత్తం కావలసిన భూమి : 2973 ఎకరాలు

సేకరణ కొరకు సమర్పించినది : 2898 ఎకరాలు

సేకరణ చేసినది : 1817 ఎకరాలు

సేకరణ చేయవలసినది : 1081 ఎకరాలు

అటవీ శాఖ అనుమతులు:

సోమశిల ప్రాజెక్ట్ జలాశయము క్రింద 741.14 హెక్టార్లు మరియు కాలువల క్రింద 273.71 హెక్టార్లు కలిపి మొత్తం 1014.85 హెక్టార్లు నకు గాను అటవీ శాఖ అనుమతులు కావలిసి ఉన్నది. గౌరవ సుప్రీమ్ కోర్ట్ వారు సోమశిల ప్రాజెక్ట్ నకు కావలసిన 1016 హెక్టార్లకు కొన్ని షరతులతో అనుమతిని ఇవ్వడం జరిగినది. 11 వ అటవీ సలహా మండలి సూచనలను అనుసరించి డి.జి.పి.యస్. సర్వే చేసి సదరు మ్యాప్స్ మరియు సమగ్ర నివేదికను అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీ వారికీ సమర్పించడమైనది. 12 వ అటవీ సలహా మండలి వారి సమావేశము తేది.19.12.2018 న స్టేజి.1/ సూత్రప్రాయమైన ఆమోదం ఇవ్వడమైనది. ఇందుకు సంబంధించి ప్రస్తుత నిఖర విలువ (N.P.V) సదరు అటవీ అధికారులు ఇవ్వ వలసి ఉన్నది.

బడ్జెట్:

2019-20 సంవత్సరం నకు గాను ప్రతిపాదించినది : రూ.366.07 కోట్లు

ప్రభుత్వం వారు ఆమోదించిన బడ్జెట్ : రూ.112.14 కోట్లు